పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ పరిధి బోయిన్పల్లిలోని సర్వే నంబర్ 157/1లో ఉన్న రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్కడే పేదల కోసం 6 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని బీఆర్ఎస్నాయకులు డిమాండ్చేశారు. ఈ మేరకు శనివారం తిరుమలగిరి తహసీల్దార్ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తోందని, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు అందాయని ఆరోపించారు.
ఈ స్థలాన్ని షాపింగ్ మాల్ కోసం కాకుండా పేదలకు గృహాల నిర్మాణానికి మాత్రమే వినియోగించాలన్నారు. నాయకులు నివేదిత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
