కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ ను డ్రగ్స్ రహితంగా మార్చుకుందామని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లో పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ జిల్లా కమిటీ సమావేశంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
డ్రగ్స్ నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. యువత మత్తు బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొని మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్లను గుర్తించి, స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
