పాత ఉపాధి చట్టమే కావాలి..వీబీ జీ రామ్‌‌‌‌ జీ చట్టాన్ని వాపస్ తీసుకోవాలి..కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ

పాత ఉపాధి చట్టమే కావాలి..వీబీ జీ రామ్‌‌‌‌ జీ చట్టాన్ని వాపస్ తీసుకోవాలి..కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ
  • ఇందిరమ్మ ఇండ్లను చట్టం పరిధిలోకి చేర్చాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ రామ్‌‌‌‌ జీ చట్టం.. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాలరాసేలా ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకుని, పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌కు మంత్రి సీతక్క మూడు వేర్వేరు లేఖలు రాశారు.కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను, సూచనలను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..వీబీ జీ రామ్‌‌‌‌ జీ చట్టం అమలు కోసం కేంద్రం రూపొందించిన నిబంధనలు దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, భూమిలేని నిరుపేద కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.

నిధుల కేటాయింపులో గ్రామ పంచాయతీల అవసరాలను విస్మరించి, రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌‌‌‌గా పరిగణించడం వల్ల ఆదిలాబాద్, ములుగు వంటి వెనుకబడిన జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేండ్ల పనిదినాల ఆధారంగానే 80 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామంపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.  అడవులు, మొక్కల పెంపకం వంటి పనులు వర్షాకాలంలోనే చేయాల్సి ఉంటుందని, ఆ సమయంలో నిషేధం విధించడం వల్ల పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు దెబ్బతింటాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల' నిర్మాణాన్ని వీబీజీ రామ్‌‌‌‌జీ పరిధిలోకి తీసుకురావాలని  కోరారు. గతంలో ఉపాధి హామీ ద్వారా గృహ నిర్మాణ లబ్ధిదారులకు 90 రోజుల పని లభించేదని, కొత్త చట్టం వల్ల ఆ అవకాశం కోల్పోతున్నారని వివరించారు. వ్యవసాయ అనుబంధ పనులు, కూరగాయల పందిళ్లు, పశుగ్రాస అభివృద్ధి వంటి జీవనోపాధి పనులకు పాత పద్ధతిలోనే అనుమతులు ఇవ్వాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వీబీ జీ రామ్ జీ చట్టం-2025 అమలుతో ప్రభావాలు, అవకాశాలు, విధానపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. దీనికి మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించనుండగా.. కమిటీ సభ్యులుగా మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. 

బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణను చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు, చిన్నారుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. శనివారం యూసుఫ్‌‌‌‌గూడలోని ఎన్ఐఎంఎస్ఎంఈలో ‘మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్‌‌‌‌వాడీ, మిషన్ శక్తి’ స్కీములపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొనియాడారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని జీరో చైల్డ్ మ్యారేజెస్ రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. అనాథలు, ఆపదలో ఉన్న పిల్లలకు భరోసా కల్పించే మిషన్ వాత్సల్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. చిన్నారులపై దాడులు, వేధింపులు జరిగినప్పుడు అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు అండగా ఉండి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.