ముందు దివాలా తీసిన కంపెనీకి ధరణి ..తర్వాత విదేశీ సంస్థ చేతుల్లోకి

ముందు దివాలా తీసిన కంపెనీకి ధరణి ..తర్వాత విదేశీ సంస్థ చేతుల్లోకి

భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్​మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)కు సాఫ్ట్ వేర్ డిజైన్, డెవలప్ మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్ పీ)ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుని 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్​ పేరును ధరణిగా నాటి సర్కారు మార్చింది. అదే ఐఎల్ఎఫ్ఎస్​ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూసుకున్నది.

 అయితే ఆర్ఎఫ్ పీలోని రూల్స్‌ ప్రకారం కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ ​కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్​లో సింగపూర్​కు చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుంది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీ... దాని పేరును టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. టెర్రాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్ లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెర్రాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా, దానికి టెక్నాలజీ సపోర్ట్​ను క్వాంటెలా సంస్థ అందజేస్తున్నది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెర్రాసిస్ కంపెనీ చేతుల్లోనే ఉన్నది.