
హైదరాబాద్, వెలుగు: అంగన్‌వాడీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కార్యదర్శి ఎల్.రూప్ సింగ్, మినీ అంగన్‌వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, యూనియన్ ప్రతినిధులు శనివారం కవితను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రిటైర్మెంట్ వయసును పెంచడంతో పాటు పదవీ వివరణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.