బీఆర్ఎస్ ది నీచపు చరిత్ర : మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ ది నీచపు చరిత్ర   : మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
  • విచారణకు సహకరించకుండా ప్రగల్భాలు 
  • రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​ ఫైర్

మహబూబాబాద్, వెలుగు :ఇంటి ఆడబిడ్డ ఫోన్​ ట్యాపింగ్​ చేసిన నీచపు చరిత్ర నాటి బీఆర్ఎస్ ​పాలకులదని రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​గౌడ్ ఫైర్​అయ్యారు. శనివారం మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో రూ.151.35 కోట్లు, మహబూబాబాద్​ మున్సిపాలిటీలో రూ.2.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 

ఈ సందర్భంగా కేసముద్రం టౌన్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఫోన్​ట్యాపింగ్​పై రాష్ట్ర ప్రభుత్వం నిజాలను నిగ్గు తేల్చడం కోసం సిట్​వేస్తే కేటీఆర్, హరీశ్​ విచారణకు సహకరించకుండా అడ్డగోలు విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. 

ఫోన్ ట్యాపింగ్ పై కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్​ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాల్లో 68 లక్షల మంది చేరినట్టు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 

రెండేండ్లలోనే రూ.40 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటుతుందని రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో  సీఎం  సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ , మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్  పాల్గొన్నారు.

మేడారం భక్తుల సేఫ్ జర్నీ ముఖ్యం : మంత్రి పొన్నం

ములుగు, తాడ్వాయి :  మేడారం జాతరకు భక్తులు సేఫ్ గా జర్నీ చేసి తమ గమ్య స్థానాలకు చేరుకోవడమే తమకు ముఖ్యమని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్, క్యూలైన్లను శనివారం ప్రారంభించారు. 

వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్నందున 4 వేల ఆర్టీసీ బస్సులను ప్రణాళికాబద్ధంగా నడుపుతున్నామన్నారు. అవసరమైతే మరిన్ని సర్వీసులు పెంచుతామన్నారు.  

ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఏటూరునాగారంలో రూ.7కోట్లతో నిర్మించనున్న బస్ డిపో కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.