
- మేం స్టార్ట్ చేస్తే డిక్షనరీలో వెతికి మరీ తిడతం: జగ్గా రెడ్డి
- కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిస్తే ఎందుకంత రాద్ధాంతం?
- బీఆర్ఎస్ అవమానిస్తే.. తాము గౌరవిస్తున్నామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ‘‘మేము తిట్టడం మొదలు పెడితే డిక్షనరీలో వెతికి మరీ తిడుతం. కేటీఆర్, హరీశ్‌లు చవటలు అని మేము అనగలం. మావొళ్లు అట్ల అంటే వాళ్లకు బాధగా ఉండదా? ” అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని, విలువల్లేని రాజకీయాలు చేస్తున్నది కేటీఆర్ అని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్.. పొన్నంని బట్టలిప్పుతా అంటవా? అంత తీస్మార్ ఖాన్వి అనుకుంటున్నవా? నువ్వెంత నీ కెపాసిటీ ఎంత? అనవసరంగా గౌరవం పోగొట్టుకోవద్దు’’ అంటూ మండిపడ్డారు.
గవర్నర్‌కు ఉన్న హక్కులను కేసీఆర్ కాలరాశారని విమర్శించారు. గవర్నర్‌ను, రాజ్యాంగాన్ని రేవంత్ గౌరవించారని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గురించి మాట్లాడే అర్హతే కేటీఆర్‌కు లేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పోరాటం నుంచి జేఏసీ ఏర్పడిందని, జేఏసీ కన్వీనర్‌గా కోదండరామ్ ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. ‘‘రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చాక తొమ్మిదేండ్లలో ఎప్పుడైనా అతన్ని గౌరవించారా? ఎన్నో అవమానాలకు గురి చేశారు. ఇప్పుడు మేం ఆయన్ను ఎమ్మెల్సీ చేసి గౌరవిస్తే.. కేటీఆర్ రాద్ధాంతం చేస్తున్నారు.
కనీసం కాంగ్రెస్ వాళ్లైనా కోదండరామ్‌ను ఎమ్మెల్సీ చేశారని బీఆర్ఎస్ లీడర్లు బయటకు చెప్పకపోయినా మనసులోనైనా అనుకోండి. గవర్నర్‌కు కృతజ్ఞతలు చెప్పండి.’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నన్నాళ్లూ ఏతులు మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధమంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరని జగ్గా రెడ్డి అన్నారు. ఇద్దరం బద్ధ శత్రువులమని, ఎదురెదురు పడితే పొడుచుకోవడమేనని చెప్పారు. ‘‘బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసింది కేసీఆర్ చెప్పినందుకు కాదా? కవిత రేపే జైలుకు పోతదంటూ ప్రచారం చేశారు.
కానీ, ఎందుకు అరెస్ట్కాలేదు. ఫెవికాల్ బంధం మీదా? మాదా? సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు హరీశ్ రావు రూ.25 కోట్లు ఖర్చు చేశారు. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ రూ.60 వేల కోట్లు తెలంగాణకు మిగులు బడ్జెట్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు. చిన్నప్పుడు అన్నం గిన్నెలో మాడిపోయిన అన్నాన్ని గీకి పెట్టెటోళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వమూ బడ్జెట్‌ను అట్లనే చేసింది. మాడు లేకుండా నాకి పారేశారు. సర్ఫ్‌తో కడగాల్సిన అవసరమేలేదన్నట్టు నాలుకతో గీకేశారు’’ అంటూ ఫైర్జగ్గారెడ్డి అయ్యారు