- కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
- కేసీఆర్‌పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్
- స్పందించకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నోటీసుల పర్వం కొనసాగుతున్నది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నీటిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు మళ్లించుకున్నారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు నోటీసులు జారీ చేసింది. వారికి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్‌చార్జి సోమ భరత్ కుమార్ సోమవారం వేర్వేరుగా నోటీసులు పంపించారు.
కేసీఆర్ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు నిరాధార ప్రచారాలకు తెరలేపారని పేర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నీటిని ఫామ్‌హౌస్‌కు అక్రమంగా తరలించారంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సోషల్ మీడియా పోస్టులు తొలగించాల్సిందే
‘వీ6 వెలుగు’ దినపత్రికలోప్రచురితమైన కథనం ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ నేతలు తమ వ్యక్తిగత, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీఆర్‌ఎస్ నోటీసుల్లో పేర్కొన్నది. ఆయా పోస్టులను బేషరతుగా తొలగించాలని, చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. నోటీసులు అందుకున్న తర్వాత స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే పోస్టులు తొలగించి వివరణ ఇవ్వకుంటే ముగ్గురు నేతలపై పరువు నష్టం దావాతోపాటు భారత న్యాయ చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
