- డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలతో పార్టీ
- ప్రతిష్టకు భంగం.. వారంలో వివరణ ఇవ్వాలి
- పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులిచ్చింది. డ్రగ్స్ తీసుకుంటూ దొరికారన్న ఆరోపణలు.. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఆరోపణలపై వారంలోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ రోహిత్ రెడ్డికి మంగళవారం నోటీసులు పంపించారు.
‘‘హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌లో సమావేశంలో ఉన్నప్పుడు.. అక్కడ డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చింది. మీడియాలో భారీగా ప్రచారం కావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టయింది. బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా.. చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటించడంలో బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వాడకానికి పార్టీ పూర్తి వ్యతిరేకం.
కనుక మీరు డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంది. దీనిని పార్టీ సీరియస్‌గా పరిగణిస్తున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు.. మీపై వచ్చిన ఆరోపణలకు వారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వండి. మీ విషయంలో తుది నిర్ణయం తీసుకునేదాకా.. మీరు పార్టీ కార్యకలాపాలు, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. వివరణ సంతృప్తికరంగా లేకుంటే.. పార్టీ రూల్స్ ప్రకారం మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటం’’ అని నోటీసుల్లో స్పష్టం చేశారు.
