నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి..బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి..బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్​జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్​చేశారు. వారికి అండగా ఉంటామన్నారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో బాధిత కుటుంబాన్ని శుక్రవారం మండల నాయకులతో కలిసి పరామర్శించారు. కేసు పురోగతిపై కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు వేడుక చూస్తున్నారని, వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తున్నారని, తమకు ఎవరూ సహకరించడం బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లా డుతూ.. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కార్యక్రమాలను పీఏ మురళీధర్ రెడ్డి యథావిధిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ పోలీసులు అతడిని ఎక్కడున్నాడో గుర్తించి పట్టుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజేందర్ కుటుంబానికి న్యాయపరమైన సహాయం అందిస్తామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి, ఆంజనేయులు, వంశీకృష్ణారెడ్డి   తదితరులు పాల్గొన్నారు.