కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే!

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే!

కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు అధికారులు.  కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ తరపు లాయర్ కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని,కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. 

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ దగ్గర కొత్తగా ఏమీ లేవన్నారు ఆమె తరపు న్యాయవాది రానా. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని... కవిత ప్రభావితం చేసే వ్యక్తి కాదన్నారు. కోర్టులో  కవిత నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.   రెండు నిమిషాలు మాట్లాడేందుకు ఆమెకు సమయం ఇవ్వాలని కోరగా.. అందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని చెప్పారు కవిత తరపు న్యాయవాది. అయితే కోర్టులో మాట్లాడేందుకు... అప్లికేషన్ వేసుకోవాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. ఇరువర్గాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు.. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించింది. కోర్టు అనుమతితో భర్త అనిల్, కుటుంబ సభ్యులను కలిశారు కవిత. 

లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 15 న కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 26 వరకు10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత.... 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు.