హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని, అంతేగాని తల్లి లాంటి పార్టీని తిట్టొద్దని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. బీఆర్‌ఎస్ నుంచి వెళ్లిపోతున్న వాళ్లు పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. పార్టీలో ఉన్నన్ని రోజులు కేసీఆర్‌కు జై కొట్టినవారు, ఇప్పుడు పార్టీనే ఉండదన్నట్టు మాట్లాడటం పద్ధతేనా? అని ప్రశ్నించారు.
శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. పార్టీ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని, పార్టీ నుంచి పోతున్న నాయకులు కాదన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీనే ఉదాహరణ అని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. పార్టీ మారే వారు తొందర పడుతున్నారని, బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని పేర్కొన్నారు.