తీస్మార్ ​ఖాన్‌లతోనే ఏం కాలేదు.. బుడ్డర్ ఖాన్‌తో ఏమైతది!

తీస్మార్ ​ఖాన్‌లతోనే ఏం కాలేదు.. బుడ్డర్ ఖాన్‌తో ఏమైతది!
  •  అడ్డగోలు వాగ్దానాలతో కుడితిలో పడ్డ ఎలుకలా కాంగ్రెస్ పరిస్థితి : కేటీఆర్‌‌
  • నాగర్ కర్నూల్, అచ్చంపేటలో కార్యకర్తల సమావేశంలో 
  • బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

అచ్చంపేట/నాగర్ కర్నూల్ టౌన్,​ వెలుగు: అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలిచ్చిన కాంగ్రెస్,​ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం నాగర్​కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై, మాట్లాడారు. ఎన్నికల ముందు అందరికీ స్కీమ్‌లని చెప్పి.. ఇప్పుడేమో కొందరికే అంటూ రాష్ట్ర సర్కార్‌‌ కొర్రీలు పెడుతున్నదని మండిపడ్డారు. 

మిషన్ భగీరథ స్కీమ్‌ను నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటుందని, 420 హమీలు అమలు చేయకుంటే ఆ పార్టీకి బొంద తవ్వుతామని హెచ్చరించారు. ఉచిత కరెంట్, రైతుబంధు, కొత్త పింఛన్లు, రూ.500కు సిలిండర్ ఇవ్వాల్సిందేనన్నారు. బీఆర్‌‌ఎస్‌ను, కేసీఆర్‌‌ను రూపుమాపడం మంచి మంచి తీస్మార్ ఖాన్‌లతోనే కాలేదని, ఈ బుడ్డర్ ఖాన్‌తో ఏం అవుతుందన్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారని, లీడర్లే ధైర్యం కోల్పోయారని కేటీఆర్‌‌ అన్నారు. రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ తెలంగాణను తెచ్చింది కేసీఆర్ అనే విషయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లె ప్రజలే నమ్మలేదని  పేర్కొన్నారు. 

 పదేండ్లలో కేసీఆర్‌‌తో ఒక్క ఫొటో దిగే పరిస్థితి రాలె.. 

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌‌ను కలిసి ఒక్క ఫొటో దిగే అవకాశం రాకపోవడం బాధ కలిగిస్తుందని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహా గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు వివిధ పదవుల్లో పని చేస్తున్నా.. కేసీఆర్ అధికారంలో ఉన్న ఏ ఒక్క రోజు ఆయనను కలిసే అవకాశం రాకపోవడం ఇబ్బందికి గురి చేసిందని కేటీఆర్ ముందు వాపోయారు. కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే బీఆర్‌‌ఎస్‌ పార్టీ ఓటమికి కారణమన్నారు. ఇప్పటి నుంచైనా ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.పదేండ్లలో కేసీఆర్‌‌తో ఒక్క ఫొటో దిగే పరిస్థితి రాలె..