
బోనాల ఉత్సవాల్లో ఓ ఎస్ఐ ,కానిస్టేబుల్ ను చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రామంతాపూర్ లో జులై 20న రాత్రి జరిగింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ సిబ్బందిని వెంటాడీ మరీ విచక్షణ రహితంగా దాడి చేశారు.
బాధిత ఎస్ఐ వివరాల ప్రకారం.. బోనాల ఉత్సవాల్లో భాగంగా రామంతాపూర్లోని భరత్ నగర్ లో ఫలారమ్ బండీ కార్యక్రమానికి పోలీసులు బందోబస్తుకు వచ్చారు. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న ఓ కారును పోలీసులు ఆపారు. ఆపిన వెంటనే కారులో ఉన్న ఆ వ్యక్తులు పారిపోయారు. . తర్వాత కాసేపటికి మద్యం తాగిన ఓ వ్యక్తి వచ్చి కారు తనదేనని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కుతరలించారు.
ఆ తర్వాత మరో 9 మంది వరకు వచ్చి తమ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎస్ఐ మధుతో వాగ్వాదానికి దిగారు. గల్లా పట్టుకుని చేతులు,కర్రలతో దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్స్ పై కూడా దాడి చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐ,కానిస్టేబుల్స్ ను వెంటపడి మరీ దాడి చేశారు. ఈ మేరకు ఎస్ఐ మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ కార్యకర్తలు అనిల్, రామ్ రాజ్, లక్ష్మణ్,సాయితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.