- ఆయన వ్యాఖ్యలు.. శాంతి భద్రతలకు ముప్పు
- డీజీపీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ ఫిర్యాదు
బషీర్‌బాగ్, వెలుగు: ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ కలిసి రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సోమవారం అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌ను ‘100 మీటర్ల లోతులో పాతిపెడతా’ అన్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
ప్రజలను రెచ్చగొట్టే విధంగా సీఎం ప్రసంగాలు చేస్తున్నారని, ఇది రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతుందని తెలిపారు. సికింద్రాబాద్ అస్తిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌పై కేసులు నమోదు చేయడం అన్యాయమని, అదే సెక్షన్లను సీఎం రేవంత్‌పైనా వర్తింపజేయాలని కోరారు. బీజేపీ, టీడీపీతో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ గద్దెలు కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సైతం ఫిర్యాదు చేశారు.
