
- టీడీపీలో చేరేందుకు వారు రెడీగున్నరు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ చెప్పారు. కొందరు నేతలు తమ పార్టీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టచ్‌లోకి వచ్చారన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ ఎన్డీయే కూటమి ఏర్పడితే కలిసి పని చేస్తామన్నారు.
అయితే, పార్టీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. పార్టీ మారాలనుకుంటున్న నేతలకు ప్రత్యామ్నాయం టీడీపీ ఒక్కటేనన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన అహంకారమే ఓడించిందని అరవింద్‌కుమార్ చెప్పారు. గతంలో టీడీపీని వీడిన నాయకులు తిరిగి వస్తే ఆహ్వానిస్తామన్నారు. ప్రస్తుతం టీటీడీపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ కోసం సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.
టీటీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చినా స్వాగతిస్తామన్నారు. అయితే, మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినవారికే ఆ బాధ్యతలను చంద్రబాబు అప్పగిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామని.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తామన్నారు.