మాట్లాడే అర్హత కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు .. అప్పులతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు

మాట్లాడే అర్హత కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు .. అప్పులతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హుస్నాబాద్/ జమ్మికుంట/ హుజూరాబాద్​ రూరల్, వెలుగు: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన బీఆర్​ఎస్​ ఇప్పుడు మాట్లాడే అర్హత కోల్పోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం హుస్నాబాద్‌, జమ్మికుంటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తెలంగాణ కోసం సొంత పార్టీనే ఎదిరించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. గత ప్రభుత్వ పాపాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అయినా తమ ప్రభుత్వం ధైర్యంగా పరిస్థితిని చక్కబెడుతోందన్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో కులగణన చేపడుతూ సామాజిక న్యాయం సాధిస్తున్నామని చెప్పారు. 
పేదలకు సన్నబియ్యం అందిస్తూ, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాల సోషల్ మీడియా ప్రచారాలు ఇక సాగవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే హుజూరాబాద్​ పట్టణంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రచారం చేశారు.

వరప్రదాయినిగా నర్మెట ఫ్యాక్టరీ

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల చివర్లో లేదా మార్చి తొలి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆ ఫ్యాక్టరీ పనులను మంత్రి పరిశీలించారు. ఆయిల్ ఫామ్ వ్యర్థాలతో నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా సిద్ధమవుతోందని చెప్పారు.

ఈ ఫ్యాక్టరీ రోజుకు 120 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉందని, ఉత్తర తెలంగాణకు వరప్రదాయంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే పంటను ఇక్కడ ప్రాసెస్ చేయవచ్చన్నారు. గతంలో టన్నుకు రూ.12 వేలు ఉన్న ఆయిల్ ఫామ్ గెల ధర ప్రస్తుతం రూ.24,456కు పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ భాష, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.