V6 News

డీలిమిటేషన్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ వ్యతిరేకం కాదు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

డీలిమిటేషన్‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌ వ్యతిరేకం కాదు : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌
  •     మహిళా రిజర్వేషన్లలో బీసీ సబ్‌‌‌‌ కోటా అడుగుతున్నాం

ఆదిలాబాద్, వెలుగు : ‘డీలిమిటేషన్‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌ పార్టీ వ్యతిరేకించడం లేదు, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి బీసీల సబ్‌‌‌‌కోటా కావాలని కోరుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. బుధవారం ఆదిలాబాద్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షురాలి పదవి ఇప్పటివరకు మహిళకు కేటాయించలేదని, దీనిని బట్టే మహిళల పట్ల వారి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా మహిళలకు అవకాశం ఇచ్చిందని, అలాగే ప్రధానిగా ఇందిరాగాంధీ, లోక్‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌గా మీరాకుమార్‌‌‌‌తో పాటు ఎందరో మహిళలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ బలహీనవర్గాల వ్యతిరేకి అని, మను ధర్మాన్ని అవలంభిస్తోందని విమర్శించారు.

కుల, జనగణన జరిగితే బలహీనవర్గాల లెక్కలు తెలుస్తాయని, అప్పుడు బలహీనవర్గాల మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే ఓ ప్రణాళిక ప్రకారం డీలిమిటేషన్‌‌‌‌ పేరుతో మహిళా బిల్లును తెస్తున్నారన్నారు. పార్లమెంట్‌‌‌‌లో బలం ఉందని ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఆదిలాబాద్‌‌‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకరిస్తానని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌‌‌‌ జాదవ్‌‌‌‌, బోథ్‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి అడే గజేందర్, టీపీసీసీ మాజీ జనరల్‌‌‌‌ సెక్రటరీ గండ్రత్‌‌‌‌ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌‌‌‌ఖాన్‌‌‌‌, కిసాన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్‌‌‌‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌‌‌‌ అడ్డి భోజారెడ్డి, అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.