- సినీ కార్మికులకు హామీలు ఇచ్చారు: గంగుల కమలాకర్
- సుమోటోగా ఈసీ కేసు నమోదు చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సినీ కార్మికులకు హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. యూసుఫ్‌గూడలో జరిగిన సినీ కార్మికుల సమావేశంలో భాగంగా సీఎం ఇచ్చిన హామీలపై ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సినిమా చూపించే వారికే అబద్ధాలు చెప్పి వారికే సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘సినీ కార్మికుల మెడపై కత్తిపెట్టి బలవంతంగా సభకు తీసుకెళ్లినట్టుంది.
అల్లు అర్జున్ లాగా ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతోనే కార్మికులు సీఎం సభకు వెళ్లారు. తెలంగాణకు హాలీవుడ్‌ను తీసుకొస్తామని సీఎం అంటున్నారు. ఉన్న సినిమా రంగాన్ని కాపాడితే చాలు’’అని గంగుల ఎద్దేవా చేశారు. సినీ రంగ కార్మికులకే సీఎం రంగుల కలలను చూపించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్‌కు సినీ కార్మికులు ఎందుకు ఓటేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్ను జైల్లో పెట్టినందుకా? ఎన్కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చి నాగార్జున కుటుంబాన్ని ఏడిపించినందుకా? అని ప్రశ్నించారు.
