- పోలీసులకు రాజా సింగ్ విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియో బైట్ ను విడుదల చేశారు. సిడ్నీలో కాల్పులకు పాల్పడిన టెర్రరిస్ట్ సాజిద్ అక్రమ్ మూలాలు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నాయని రాజాసింగ్ ఆరోపించారు. టోలి చౌకీ ప్రాంతంలో చదువుకొని, ఆస్ట్రేలియాలో సాజిద్ స్థిరపడ్డాడని తెలిపారు.
అతని కుమారుడు నవీద్ అక్రమ్ తో కలిసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సాజిద్ కు సంబంధించిన వాళ్లు ఎవరైనా హైదరాబాద్ నగరంలో ఉన్నారా? అనే కోణంలో పోలీసులు, ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ లు చేపడితే, వాస్తవాలు బయటకు వస్తాయని, ఆ దిశగా పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
