నల్గొండలో డిసెంబర్ 24 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దీక్షలు : కొంపెల్లి భిక్షపతి

నల్గొండలో డిసెంబర్ 24 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దీక్షలు :  కొంపెల్లి భిక్షపతి

నల్గొండ, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్​తో ఈనెల 24 నుంచి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా నాయకుడు కొంపెల్లి భిక్షపతి అన్నారు. మంగళవారం పీఆర్‌టీయూ సంఘ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

2024 మార్చి తరువాత ఉద్యోగ విరమణ పొంది ఇప్పటికీ సుమారు 20 నెలలు గడిచినా, వారికి రావాల్సిన పెన్షన్ , గ్రాట్యూటీ, కమ్యూటేషన్, ఫైనల్ ఎన్‌క్యాష్‌మెంట్, జీఐఎస్, టీజీఎల్‌ఐ, పీఆర్సీ ఏరియర్స్, సర్వీస్ కాలంలో సరెండర్ చేసిన లీవ్ డబ్బులు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 63 ఏండ్ల వయసులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పిల్లల వివాహాలు చేయలేక, ఇంటి లోన్ల ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

 ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2024 మార్చి తరువాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులందరికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించేందుకు ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు  విడుదల చేయాలని డిమాండ్  చేశారు.