- జనవరి 14 వరకు నెల పాటు ఉత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలు షురూ అయ్యాయి. తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు ప్రధానాలయ ముఖ మంటపంలో గోదాదేవి అమ్మవారికి చేపట్టిన ప్రత్యేక ఉత్సవ సేవతో అర్చకులు ధనుర్మాస ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గోదా అమ్మవారికి ఉత్సవ సేవను వైభవోపేతంగా నిర్వహించారు.
మంగళవారం మొదలైన ధనుర్మాస ఉత్సవాలు జనవరి 14 వరకు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14 వరకు ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు.. ప్రధానాలయ ముఖ మంటపం ఉత్తర దిశలో గోదా అమ్మవారిని అధిష్టింపజేసి అరగంట పాటు ‘తిరుప్పావై’ కైంకర్యాన్ని కన్నులపండువగా నిర్వహించనున్నారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు ‘గోదా కల్యాణం’, 15న ఉదయం 11:30 గంటలకు అమ్మవారికి ఒడిబియ్యం పోసే వేడుకను చేపట్టనున్నారు. అనంతరం నిర్వహించే ప్రత్యేక పూజలతో ధనుర్మాస ఉత్సవాలను పరిసమాప్తం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
