తగ్గిన ఏకగ్రీవాలు ..గత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వలేదు

తగ్గిన ఏకగ్రీవాలు ..గత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వలేదు
  • 2019లో సుమారు 2,134 పంచాయతీలు, 29,985 వార్డులు ఏకగ్రీవం
  • ఈ సారి 1,204 సర్పంచ్‌‌ పదవులు, 25,551 వార్డులకే పరిమితం.. 
  • ఎన్నికల నిబంధనలు కఠినతరం కావడంతో తగ్గిన జోరు.. 
  • గత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం..
  • ఈ సారీ నజరానాలు లేకపోవడమూ కారణమే..

హైదరాబాద్, వెలుగు : పంచాయతీ ఎన్నికలంటే ఒకప్పుడు ఏకగ్రీవాల జాతర సాగేది. ఓ మంచి వ్యక్తిని సర్పంచ్‌‌గా ఏకగ్రీవం చేసుకుంటే ఊరు బాగుపడుతుందని భావించేవారు. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో అభివృద్ధి పనులూ చేపట్టవచ్చన్న ఆలోచనతో జనం ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపేవారు. కానీ క్రమంగా సీన్‌‌ మారిపోతోంది. 

ఎంతో నమ్మకంతో ఏకగ్రీవం చేసుకున్న సర్పంచ్‌‌లు స్వలాభం చూసుకోవడంతో పాటు గత ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, తాజాగా ప్రభుత్వం ఎలాంటి నజరానాలు ప్రకటించకపోవడంతో చాలా మంది ఈ సారి ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపలేదు. దీనికి తోడు ఏకగ్రీవాల పేరుతో లక్షలకు లక్షలు వేలం పాడి సర్పంచ్, వార్డు మెంబర్‌‌ పదవులను కొనుక్కోవడం పరిపాటిగా మారింది. దీంతో ఎన్నికల అధికారులు నిబంధనలను కఠినతరం చేయడంతో ఈ సారి ఏకగ్రీవాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

2019లో 2,134.. ఈ సారి 1,204..

గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఏకగ్రీవ సర్పంచుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,134 మంది సర్పంచులు, 29,985 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఈ సారి 1,204 సర్పంచులు, 25,551 వార్డు సభ్యులు యునానిమస్‌‌గా ఎన్నికయ్యారు. అంటే గతానికి కంటే 903 మంది సర్పంచులు, 4,434 వార్డు సభ్యులు తగ్గారు.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ  పంచాయతీలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నజరానా (ప్రోత్సాహకం) ఇస్తామని ప్రకటించడంతో చాలా గ్రామాల్లో పోటీ లేకుండా సర్పంచులను ఎన్నుకున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తండాల్లో చాలా వరకు సర్పంచులను, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నారు. తీరా ఎన్నికలు అయిపోయాక ఏకగ్రీవ పంచాయతీలకు నాటి బీఆర్ఎస్​సర్కార్‌‌ నయాపైసా ఇవ్వలేదు. 

నజరానాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక విసుగు చెందారు. ఈ చేదు అనుభవాలతో చాలా గ్రామాలు, తండాలు ఈసారి ఏకగ్రీవానికి దూరమయ్యాయి. దీనికి తోడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ సారి ఎలాంటి నజరానాలు ప్రకటించకపోవడం కూడా ఏకగ్రీవాలు తగ్గడానికి మరో కారణంగా భావిస్తున్నారు. 

నిబంధనలు కఠినతరం 

ఈ సారి ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని కఠిన నిబంధనలు అమలుచేసింది. ఏకగ్రీవాల ముసుగులో సర్పంచ్‌‌ పదవులకు వేలం పాటలు జరుగుతుండడంతో ఏకగ్రీవాలకు  కలెక్టర్‌‌ క్లియరెన్స్ ఉండాలని ప్రకటించింది. 

బేరసారాలు, ప్రలోభాలు, బెదిరింపులతో జరిగే ఏకగ్రీవాలు చెల్లవని స్పష్టం చేసింది. ఒకే నామినేషన్‌‌ పడినా, ఒకటి తప్ప మిగిలిన నామినేషన్లు విత్‌‌డ్రా అయినా వెంటనే ఫలితాలు ప్రకటించొద్దని అధికారులను ఆదేశించింది. ఆర్‌‌వోలు రిపోర్ట్ పంపాకే ఫైనల్‌‌ డిక్లరేషన్‌‌ చేయాలని సూచించింది. జిల్లాస్థాయిలో ‘స్పెషల్ మానిటరింగ్ సెల్’ ఏర్పాటు చేయడంతోపాటు తేడా వస్తే ఎన్నికనే రద్దు చేస్తామని హెచ్చరించింది. 

నామినేషన్లు విత్‌‌డ్రా చేసుకున్న వెంటనే ఫలితాన్ని ప్రకటించకుండా ‘తప్పనిసరి తనిఖీ విధానం’ (మాండేటరీ వెరిఫికేషన్ ప్రొటోకాల్) పాటించాలని సూచించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని, వేలం పాటలు, ప్రలోభాలు జరిగినట్లు తేలితే ఎన్నిక రద్దు చేయాలని స్పష్టం చేసింది. 

దీనికి తోడు ఏకగ్రీవమయ్యే సీట్లలో అక్రమాలను అడ్డుకునేందుకు రెండు రకాల హామీ పత్రాలను (అనెక్సరీ) కూడా తప్పనిసరి చేసింది. ఇలాంటి నిబంధనలు అమలు చేయడం వల్ల కూడా ఏకగ్రీవాలు తగ్గాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.