వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న శివకల్యాణ మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయమే అర్చకులు తీర్థపూజ, రుద్రాభిషేకం, పరిహార దేవతార్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యామండపంలో శేషహోమం, పూర్ణాహుతి, దేవతోద్వాసన, పుష్పయాగం, అవాహిత దేవతాహోమం, ఏకాదశ రుద్ర కలశ స్థాపన, రుద్రయాగం జరిపారు. క్షేత్రపాలక బలి, త్రిశూల యాత్ర అనంతరం ఆలయ సమీపంలో తాత్కలితంగా ఏర్పాటు చేసిన నీటి కొలను వద్ద అవభృధ స్నానం నిర్వహించారు. శివ పురాణ ప్రవచనము నిర్వహించిన అనంతరం రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలను ముగించారు.
భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజలు జరిపించిన అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు తులాల బంగారు బ్రాస్‌లెట్ పోగొట్టుకోగా.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది డప్పు నాగమణికి దొరకడంతో ఆమె ఆఫీసర్లకు అందజేశారు. వారు విచారణ జరిపి సదరు వ్యక్తికి బ్రాస్‌లెట్ అందజేసి, నాగమణిని అభినందించారు.
