- తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
- జనవరిలో దేశమంతా పర్యటించి మద్దతు కూడగడతాం
- ఓబీసీ జాతీయ సెమినార్లో బీసీ జేఏసీ నేతల హెచ్చరిక
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 11 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాయని, తక్షణమే ఈ తీర్మానాలను ఆమోదించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్లో ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించారు.
బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, అధికార ప్రతినిధి తాటికొండ విక్రమ్ సమన్వయంతో జరిగిన ఈ సెమినార్లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, పలు పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాజుల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పందించకపోతే రైతు ఉద్యమం తరహాలోనే దేశాన్ని ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
బీసీ ఉద్యమానికి అండగా సీపీఐ: కె. నారాయణ
బీసీ ఉద్యమానికి జాతీయ స్థాయిలో సీపీఐ అండగా ఉంటుందని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ కె. నారాయణ ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదే అని, వారిపై ఒత్తిడి పెంచడానికి తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమాన్ని చేపడతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. దీనిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.
