పోలీసుల అదుపులో బడే చొక్కారావు.. మరో 16 మంది మావోయిస్టులు కూడా

పోలీసుల అదుపులో బడే చొక్కారావు.. మరో 16 మంది మావోయిస్టులు కూడా
  •     ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​లో పట్టుకొని హైదరాబాద్​కు తరలింపు
  •     వారిలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు ఉన్నట్టు వార్తలు
  •     ఇయ్యాల డీజీపీ ఎదుట హాజరుపరిచే చాన్స్

ఆసిఫాబాద్/తాడ్వాయి/భద్రాచలం, వెలుగు: మవోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్​కౌంటర్లతో కుదేలవుతున్న పార్టీని లొంగుబాట్లు, అరెస్టులు మరింత దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసులు అదుపులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కుంమ్రం భీమ్ ఆసిఫాబాద్​జిల్లా సిర్పూర్ లో సోమవారం ఉదయం 16 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కినట్టు వార్తలు వస్తున్నాయి. 

దండకారణ్యం, కర్రెగుట్టల్లో జరుగుతున్న ‘ఆపరేషన్​కగార్’​ నుంచి తప్పించుకొని వచ్చిన వీరు ఇక్కడ  ఓ ఇంట్లో షెల్టర్​పొందుతున్నట్టు తెలిసింది. స్టేట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పట్టుబడ్డ వారిలో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిలో దామోదర్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆయనతో పాటు డిస్ట్రిక్ట్ కమాండెంట్ మెంబర్స్ నలుగురు ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి 303 తుపాకులు, ఏకే–47 లు తదితర ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

పట్టుకున్న మావోయిస్టులను పోలీసులు అత్యంత రహస్యంగా హైదరాబాద్ కు తరలించారు. బుధవారం వీరిని డీజీపీ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ జిల్లాలో ఈ ఘటన  కలకలం రేపుతోంది. దండకారణ్యం నుంచి తప్పించుకుని చత్తీస్ గఢ్, మహారాష్ట్ర మీదుగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించారు. దీనిపై సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

నా కొడుక్కు హాని తలపెట్టకండి: దామోదర్​ తల్లి

బడే చొక్కారావు అలియాస్​ దామోదర్ ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలో చేరాడు. అప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా ఇంటికి రాలేదని తల్లి బతుకమ్మ తెలిపింది. దామోదర్ పోలీసులకు పట్టబడ్డాడనే వార్తలు వస్తుండడంతో.. తన కొడుకుకు ఎలాంటి హాని తలపెట్టద్దని ఆమె పోలీసులను వేడుకుంటున్నది. కొడుకు రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు చెప్పింది. 

బీజాపూర్​లో 34 మంది మావోయిస్టుల సరెండర్ 

చత్తీస్​గఢ్ రాష్ట్రంలో మంగళవారం కేర్లాపాల్ ఏరియా కమిటీకి చెందిన 34 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. వీరిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం ఒకరు, పీఎల్జీఏ కంపెనీ నంబర్ 2కు చెందిన నలుగురు, ఏరియా కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్, ఏరియా కమిటీ సభ్యులు ఎనిమిది మంది, మిలీషియా ప్లాటూన్​ కమాండర్లు ముగ్గురు, మిలీషియా సభ్యులు ఐదుగురు, పీఎల్​జీఏ సభ్యులు ఒకరు, జనతన సర్కార్ సభ్యులు కూడా సరెండర్​ అయిన వారిలో ఉన్నారు. వీరందరిపై మొత్తం రూ.84 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్​ తెలిపారు.