వార్డుల హద్దులు సరిగ్గా లేవ్ ..డీలిమిటేషన్పై కౌన్సిల్ లో సుదీర్ఘ చర్చ

వార్డుల హద్దులు సరిగ్గా లేవ్ ..డీలిమిటేషన్పై కౌన్సిల్ లో సుదీర్ఘ చర్చ
  • ఒక్కో డివిజన్​లో 15 వేల జనాభా.. మరికొన్నింటిలో 65 వేల జనాభా
  • ఏ సెన్సస్ డేటా ఆధారంగా చేసుకున్నారో తెల్వదు
  • సభ్యుల అభ్యంతరాలు వినేందుకు  బల్దియా స్పెషల్ కౌన్సిల్ మీటింగ్​ 
  • సుమారు ఐదు గంటల పాటు సాగిన చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా విస్తరణ తర్వాత వార్డుల డీలిమిటేషన్​పై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. జీహెచ్ఎంసీ చరిత్రలో తొలిసారి పెట్టిన స్పెషల్ మీటింగ్ ఉదయం 10–50 గంటలకు ప్రారంభమై.. లంచ్ బ్రేక్ మినహా సాయంత్రం వరకు కొనసాగింది. మీటింగ్​మొదలుకాగానే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టారు. 

152 మంది సభ్యులు హాజరుకాగా, ఇందులో 26 మంది ఎక్స్ అఫిషియో, మిగిలిన 126 మంది కార్పొరేటర్లు ఉన్నారు. విస్తరణకు సంబంధించిన అంశం కావడంతో ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. చర్చలో 61 మంది మాట్లాడగా, అప్పుడప్పుడు అధికార పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్య చిన్నచిన్న విమర్శలు తప్పా చివరి వరకూ మీటింగ్ ప్రశాంతంగా సాగింది. కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు, మరికొందరు మినహా మిగిలిన వారంతా పునర్విభజనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేయగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించాయి. 

గూగుల్ మ్యాప్స్​తో విభజన: బీఆర్ఎస్

ల్యాప్ టాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వార్డుల పునర్విభజన చేసినట్లు కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కనీసం మేయర్‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌కు కూడా తెలియకుండా డీలిమిటేషన్ చేయడం సిగ్గుచేటన్నారు. కనీసం నెల తీసుకొని సంబంధిత ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించాలని, ఓటింగ్ ద్వారా పునర్వభజన చేయాలన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన  గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం-1996కు, అలాగే 74వ రాజ్యాంగ సవరణ కు  విరుద్ధంగా ఉందన్నారు. 

డీలిమిటేషన్ మొత్తం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనల ఆధారంగా జరగడమేంటని, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక అడ్వైజరీ సంస్థ మాత్రమే, రాజ్యాంగబద్ధ సంస్థ కాదన్నారు. జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం చెబుతోందని, 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలని, చట్టం ప్రకారం జనాభా వ్యత్యాసం10 శాతం మించకూడదని ఉందని, కొన్ని వార్డుల్లో ఈ పరిమితిని మించిన దాఖలాలు ఉన్నాయన్నారు. 

ఇది రూల్ నెంబర్-5కు విరుద్ధమన్నారు. డీలిమిటేషన్‌‌‌‌కు ఏ సెన్సస్ డేటాను ఆధారంగా తీసుకున్నారో, భౌగోళిక పరిమాణాన్ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌ తక్షణమే ఉపసంహరించాలని, రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు సబితారెడ్డి, కాలేరు వెంకటేష్, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ డీలిమిటేషన్ తో మేడ్చల్ కు నష్టం జరిగిందని, 61 మంది సర్పంచ్ లు, 270 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఐదుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు కలిపి 440 మంది లీడర్లు ఉండేవారని, ఇప్పుడు  కేవలం 16 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేసి ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. 

ఎంఐఎం డ్యామేజీ కోసమే: ఎంఐఎం 

ఎంఐఎం పార్టీని డ్యామెజ్ చేసేందుకే వార్డుల విభజన చేసినట్లు కనిపిస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్ బలాల ఆరోపించారు. విభజనకి 2011 సెన్సస్ కాకుండా ఇతర వివరాలు ఏమీ లేవా? అని ప్రశ్నించారు. 300 వార్డుల విభజన తర్వాత పిలిచి అడగడం బాగానే ఉందని, కానీ బౌండరీల విషయంలో ఉన్న అభ్యంతరాలపై స్పందించాలన్నారు. షేక్​పేట్ కార్పొరేటర్ ఫరాజుద్దిన్ మాట్లాడుతూ షేక్ పేట్ డివిజన్ లో మార్పులు చేశారని, షేక్ పేట్ పేరు తొలగించి ఓయూ కాలనీ పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 

కౌన్సిల్​లో ప్రశ్నల వర్షం....

సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, బొంతు శ్రీదేవి, విజయారెడ్డి, స్వామి, రవీందర్ మాట్లాడుతూ డివిజన్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, ఇరుగు పొరుగు వార్డుల ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తమ  వార్డులలో కలిపేశారని, వార్డుల పేర్లు కూడా గందరగోళంగా పెట్టారని కౌన్సిల్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.

 డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కూడా పూర్తిగా మారిపోయిందని, విలీనం, పునర్విభజన కు సంబంధించి తనకు, మేయర్ కు కాస్త ముందస్తు సమాచారముందని అనడంతో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు జోక్యం చేసుకుని మేయర్ సమాచారం లేదని అంటుంటే మీరు ముందే ఉందని అంటున్నారేమిటి అని ప్రశ్నించారు. దీంతో పత్రికల్లో కథనాలు చదివానని డిప్యూటీ మేయర్ సమాధానమిచ్చారు.

ఎంఐఎం మేలు కోసమే: బీజేపీ

 బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. లక్షపై చిలుకు జనాభా ఉన్న అమీన్ పూర్​ను రెండు వార్డులుగా విభజించారని, మరో రెండు వార్డులు పెంచాలని, అససరమైతే ఆఖిల పక్ష కమిటీని నియమించాలని కోరారు. ఫ్లోర్​లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ వార్డుల విభజన కరెక్ట్​గా జరగలేదన్నారు. ఎంఐఎం మేలు కోసమే జరిగినట్టు కనిపిస్తోందన్నారు. ఒక్కో డివిజన్ లో 15 వేల మంది జనాభా ఉంటే, మరికొన్నింటిలో 65 వేల జనాభా ఉందన్నారు. మన్సూరాబాద్​కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ తన డివిజన్ ను మూడు ముక్కలు చేశారన్నారు.  

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ గెజిట్ లో ఇచ్చిన హద్దులన్నీ తప్పుగా ఉన్నాయని, మల్కాజిగిరిలో ఇచ్చిన బౌండరీలు ఎక్కడ ఉన్నాయో తమకే తెలియడంలేదన్నారు. 4.25 గంటలకు బీజేపీ కార్పొరేటర్ మహేందర్ మాట్లాడుతూ ‘దారుస్సలాంలో వార్డుల విభజన చేశారు’ అని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. తప్పుల తడకగా ఉందంటూ గెజిట్ పేపర్లను చింపిన బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్​లో విసిరేశారు. దీంతో ఎఐఎం, కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గందరగోళం నడుమ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి పంపించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్​కర్ణన్​ను మేయర్​కోరారు. తర్వాత 4.34 గంటలకు సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.

హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతది: కాంగ్రెస్

వార్డుల విభజనపై అందరిని అడిగి చేసుకుంటే బాగుండేందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇందుకోసం ముందే మీటింగ్ పెట్టాల్సిఉండేదన్నారు. అయినప్పటికీ సభ్యుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గతంలో జీవోలు వచ్చిన కూడా బయటకు వచ్చేది కాదని, ఇప్పుడు జీవోలన్ని ప్రజల్లోకి వస్తున్నాయన్నారు. 

జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గతంలో డీలిమిటేషన్  చేసిన సమయంలో ఇలా ఒపీనీయన్స్ తీసుకోలేదని, పొలిటికల్ ఇంట్రెస్ట్ ను పక్కన పెట్టాలన్నారు. ఏమైనా సవరణలు అవసరం ఉంటే అధికారులు చూడాలన్నారు. 

45 వేల జనాభా ప్రామాణికంగా: కమిషనర్

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షత ప్రారంభమైన సమావేశంలో కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. లోకల్ బాడీల విలీనంతో 650 చదరపు కిలోమీటర్ల వరకున్న విస్తీర్ణం.. సుమారు 2050 కిలోమీటర్లకు పెరిగిందని, సర్కారు ఆదేశాల మేరకు శాస్త్రీయంగా పునర్విభజన చేశామన్నారు. 300 వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో వార్డుకు నలుదిక్కుల సరిహద్దులను ఫిక్స్ చేస్తూ 45 వేల జనాభాను ప్రామాణికంగా తీసుకుని, పది శాతం తక్కువ, ఎక్కువతో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి డ్రాఫ్ట్ పై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల 17 వరకు (బుధవారం) అభ్యంతరాలు చెప్పవచ్చన్నారు.