బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పొత్తుల టెన్షన్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పొత్తుల టెన్షన్‌
  • మునుగోడు బైపోల్‌తో మారిన సీన్‌
  • సీపీఐ, సీపీఎంతో కూటమిగానే బరిలోకి బీఆర్‌ఎస్‌
  • తమకు బలమున్న చోట పోటీ చేస్తామంటున్న కమ్యూనిస్టులు

హైదరాబాద్‌, వెలుగు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పొత్తుల టెన్షన్‌ పట్టుకుంది. తమ సీట్లను కమ్యూనిస్టులు ఎక్కడ తన్నుకు పోతారేమోనని హైరానా చెందుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు టీఆర్‌ఎస్‌ పేరు బీఆర్‌ఎస్‌ గా మార్చడంతో రాష్ట్రంలో పొలిటికల్‌ సీన్‌ మారిపోయింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టడం దాదాపు ఖాయమైంది. జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రంలోనూ తమ పయనం సీపీఐ, సీపీఎంతో కలిసే సాగుతుందని మునుగోడు ఎన్నికపుడు కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. సీపీఐ, సీపీఎం సెక్రటరీలు సైతం వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయమని చెప్తున్నారు. ఒకవేళ పొత్తు కుదరకుంటే తమకు బలమున్న అన్ని సీట్లలో పోటీ చేస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ లు తమ బలం పెంచుకొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని బీఆర్ఎస్​ ముఖ్య నేతలు లెక్కలేసుకుంటున్నారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తుకే సై అంటున్నారు. ఇది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తోంది.

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోటీకి ప్లాన్​ 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటు ఇంకో రెండుమూడు సీట్లలో పోటీ చేస్తామని సీపీఎం నేతలు చెప్తున్నారు. మరోవైపు సీపీఐ నేతలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, వైరా, నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ స్థానాలతో పాటు మరో 2సీట్లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ సీటు ఎవరికనే స్థాయిలో చర్చలు జరగకున్నా, ఎక్కడ పోటీ చేయబోతున్నాం అనేది మాత్రం పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. సీపీఐ కోరుతున్న అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీపీఎం కోరుతున్న భద్రాచలం, మధిర స్థానాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 పార్టీలు తలా ఐదేసి ఎమ్మెల్యే సీట్లు పొత్తులో భాగంగా కేటాయించాలనే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే తమ కోసం ఈమాత్రం చేయలేరా అన్నది కమ్యూనిస్టుల భావన. కమ్యూనిస్టులతో చెడితే రాష్ట్రంలో దెబ్బతినడమే కాదు జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలను దూరం చేసుకున్నట్టే అవుతుందన్న ఆందోళన బీఆర్​ఎస్​ శిబిరంలోనూ ఉంది.

ప్రత్యామ్నాయంపై సిట్టింగ్​ల దృష్టి

ఈ ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలోగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ పెట్టి అసెంబ్లీని రద్దు చేస్తే ఆగస్టులోగా ఎలక్షన్స్​ వస్తాయి. అసెంబ్లీ రద్దుపై కేసీఆర్‌ మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. అయినా ఎమ్మెల్యేలంతా ఎన్నికల​కు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులు తమ సీట్లకు ఎసరు పెడితే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపైనా వారు దృష్టి సారించినట్టు సమాచారం. ఏ పార్టీలోకి వెళ్తే లాభం చేకూరుతుందనే దానిపై తమ సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికలకు దూరంగా ఉన్నా తర్వాత ఏ పదవీ దక్కదని వాళ్లలో ఎక్కువ మంది నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ సీటు రాకుంటే పార్టీని వీడటమే మేలనే ఆలోచనలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది.