సాధారణ ఖైదీలా కవిత .. ఇయ్యాల కవితతో భర్త అనిల్ ములాఖత్ 

సాధారణ ఖైదీలా కవిత .. ఇయ్యాల కవితతో భర్త అనిల్ ములాఖత్ 
  • తీహార్​ జైలు కాంప్లెక్స్​ 6లో సెల్​ కేటాయింపు
  • తొలిరోజు రాత్రి జైలు ఫుడ్.. పప్పు అన్నంతో సరి  
  • రెండోరోజు పొద్దున టీ, స్నాక్స్​తో బ్రేక్ ఫాస్ట్  
  • ఇంటి ఫుడ్, ఇతర సౌలతులు సమకూర్చే అవకాశం 

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిరోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తీహార్ జైలులోని మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ 6 కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్​లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు.

వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్లు తెలిసింది. మంగళవారం సీబీఐ స్పెషల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్​ విధించడంతో పోలీసులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం జైలు నిబంధల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్ కు పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లోబీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవల్ కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి.  

తీహార్ జైలులో కవితకు హోం ఫుడ్ తో పాటు, పలు వెసులుబాట్లు కల్పిస్తు రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పరుపు, జత చెప్పులు, బట్టలు, బెడ్‌‌‌‌షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్, కాగితాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని పేర్కొంది. కానీ ఇవేమీ లేకుండానే కవిత మంగళ, బుధవారాలను ముగించారు. ఆమెకు కూడా ఇతర ఖైదీల మాదిరిగానే జైలు ఆహారం, సాధారణ సౌకర్యాలు మాత్రమే జైలు సిబ్బంది కల్పించారు. జైలు నిబంధనల ప్రకారం కవితకు పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్‌‌‌‌షీట్, దుప్పటి, డాక్టర్ల సూచనల మేరకు మందులు అందించినట్లు తెలిసింది. తొలిరోజు అయిన మంగళవారం రాత్రి భోజనంలో పప్పు, అన్నం తిని ఆమె నిద్రపోయారు. బుధవారం ఉదయం అందరిలాగానే టీ, స్నాక్స్ తీసుకున్నారు. రాత్రి కాస్తంత ఆహారం తీసుకొని సెల్ కు చేరుకున్నారు. 

అందరిలాగే టీవీ చూడొచ్చు   

కవితకు కూడా టీ, లంచ్, డిన్నర్, టీవీ చూసే సమయాలు అందరు మహిళా ఖైదీల మాదిరిగానే ఉంటాయని జైలు మెస్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఖైదీలందరికీ తీహార్ జైలు లైబ్రరీలోని పుస్తకాలు చదివేందుకు అనుమతి ఉంటుందన్నారు. అయితే, కవిత ప్రత్యేకంగా ఎలాంటి సౌలతులు కోరలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు. కానీ, త్వరలో కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న సౌకర్యాలను ఆమెకు కల్పిస్తామన్నారు. ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతించినా, ఆమెను జైలుకు తీసుకువచ్చిన టైంలో మెడలో మంగళసూత్రం, చెవులకు కమ్మలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.  

తీహార్ లోనే ఆప్ నేతలు 

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆప్ ముఖ్యనేతలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా తీహార్ జైలులోనే ఉంటున్నారు. సిసోడియా జైలు నెంబర్1, సంజయ్ సింగ్ జైలు నెంబర్ 2, సత్యేందర్ జైన్ జైలు నెంబర్ 7 కాంప్లెక్స్ లో ఉంటుండగా.. కవితకు జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ లోని సెల్ ను కేటాయించారు. 

నేడు కవితను కలవనున్న భర్త  

తీహార్ జైలులో కవితతో ఆమె భర్త అనిల్ గురువారం ములాఖత్ కానున్నారు. ఈడీ కస్టడీ టైంలో, కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనూ అనిల్ ఆమెను కలిశారు. కోర్టు హాల్ నుంచి జైలుకు తరలిస్తోన్న టైంలోనూ ‘బై మమ్మ’ అంటూ కవితకు మనోధైర్యాన్ని ఇచ్చారు. జైలు రూల్స్ ప్రకారం వారానికి రెండు రోజులు మాత్రమే ఖైదీలతో ములాఖత్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తీహార్ జైలుకు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ కవితను కలవలేదు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను భర్త అనిల్ తొలిసారిగా గురువారం ఉదయం 8 గంటలకు కలవనున్నారు. అలాగే కోర్టు అనుమతిచ్చిన ప్రకారం.. ఆమెకు ఇంటి ఫుడ్, ఇతర సౌలతులు కల్పించనున్నట్లు కూడా తెలిసింది.