టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక అవార్డు ప్రధానోత్సవంలో చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. దివంగత లెంజడరీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా రాజేంద్రప్రసాద్ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన 'కత్తి కాంతారావు మెమోరియల్ నేషనల్ అవార్డ్' వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని కొనియాడారు. తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే, వారి మధ్య 'తిలకం' వంటి వారు కాంతారావు అని ప్రశంసించారు. అయితే, ఇదే క్రమంలో ఆయన ఎంజీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ.. కాంతారావు ని చూస్తే ఎంజీఆర్ భయపడేవారని, ఆయన పేరు వింటేనే వణికిపోయేవారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
He told truth only right? pic.twitter.com/RIuflbWfSM
— Swaasthi (@swaasthi) March 12, 2026
విశాల్ సీరియస్..
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై నటుడు విశాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక లెజెండరీ నటుడిని పొగిడే క్రమంలో మరొక మహోన్నత వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంజీఆర్ గారు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తమిళనాడు గర్వించదగ్గ గొప్ప నాయకుడు. కాంతారావు గారిని మీరు గౌరవించడం అభినందనీయం, కానీ ఎంజీఆర్ గారిని కించపరచడం కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మీ స్థాయి నటుడి గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే నేను ఎలాగైతే స్పందిస్తానో, ఇప్పుడు ఎంజీఆర్ గారి కోసం అలాగే మాట్లాడుతున్నాను అన్ని అన్నారు. వెంటనే రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.
Shocking and repelling to see and hear the recent comments of senior actor Shri Rajendra Prasad, senior actor of our Telugu film industry at a recent function.
— Vishal (@VishalKOfficial) March 12, 2026
Dear Sir, with utmost regards and at the same time with a heavy heart, I pen down this tweet condemning your speech…
దాదాపు 48 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న రాజేంద్రప్రసాద్.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా లభించింది. ఎంతో అనుభవం ఉన్న ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఒక కళాకారుడుని ప్రశంసించే ముందు మరొక కళాకారుడి గురించి చులకనగా మాట్లాడటం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. కళాకారులకు భాషా భేదం లేకపోయినా, ఒక ప్రాంతీయ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తిపై విమర్శలు చేయడం పద్దతి కాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించి క్షమాపణలు చెబుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
