పార్లమెంట్​ ఎన్నికలపై బీఆర్ఎస్ ​ఫోకస్

పార్లమెంట్​ ఎన్నికలపై బీఆర్ఎస్ ​ఫోకస్

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికలపై బీఆర్ఎస్​ ఫోకస్​ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్​సభ పోరును చాలెంజ్​గా తీసుకున్న బీఆర్ఎస్.. మిగతా పార్టీల కంటే​ ముందే రంగంలోకి దిగింది. సోమవారం తెలంగాణ భవన్​లో చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

2019 పార్లమెంట్​ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడం, బీజేపీ ప్రాబల్యం కూడా పెరగడంతో ఈసారి ఎక్కువ నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని కేటీఆర్ ​చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలపై ఇక వరుస సమీక్షలు, సమావేశాలు ఉంటాయని చెప్పారు. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్​లో రోజుకు ఒక లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్​సభ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువగా పని చేసి మంచి ఫలితాలు సాధించడమే టార్గెట్​గా పని చేద్దామని చెప్పినట్టు తెలిసింది. పార్టీ ఓడిపోయిన స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్​చార్జీలుగా ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఓటమికి దారితీసిన పరిస్థితులపైనా సమీక్షించారు.

చేవెళ్లలో 98 వేల ఓట్ల లీడ్ ​ఉన్నది

చేవెళ్ల లోక్​సభ స్థానంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల లోక్​సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు 4 చోట్ల బీఆర్ఎస్ ​అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారని, మొత్తం పార్లమెంట్ ​పరిధిలో బీఆర్ఎస్​కు 98 వేల ఓట్ల లీడ్​వచ్చిందని గుర్తు చేశారు. గత లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైందని, అప్పుడు బీజేపీ అభ్యర్థికి 15 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈసారి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. ఆ పార్టీ ప్రాబల్యం ఎంత పెరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​దక్కిన 98 వేల ఓట్ల మెజార్టీని నిలబెట్టుకునేలా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్​గౌడ్, అరికేపూడి గాంధీ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నన్ను మళ్లీ పోటీ చేయమన్నరు: రంజిత్​రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్​ స్థానం నుంచి తనను మళ్లీ పోటీ చేయాలని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ ​చెప్పారని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని ఆయన తెలిపారు. కేటీఆర్​తో సమావేశం అనంతరం తెలంగాణ భవన్​లో మీడియాతో  ఆయన మాట్లాడారు. లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్​దిశానిర్దేశం చేశారని చెప్పారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్​అని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎంతో అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ​ఇచ్చిన తప్పుడు హామీలతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్​ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఆ పార్టీల ఆశలు నెరవేరబోవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు.