స్వాగతాలు అక్కడ.. సావగొట్టుడిక్కడ..బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిన పోలీసులు

స్వాగతాలు అక్కడ.. సావగొట్టుడిక్కడ..బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిన పోలీసులు
  • కవిత ధర్నాకు పోలీసుల బందోబస్తు
  • మినిస్టర్ క్వార్టర్స్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జి
  • మధ్యాహ్న భోజన కార్మికుల వద్ద అదే సీన్ 
  • కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టకుండా రక్షణ
  • కాంగ్రెస్ దిష్టిబొమ్మల వద్ద ప్రేక్షక పాత్ర
  • పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

హైదరాబాద్: ఆందోళనలు, నిరసనలతో తెలంగాణ అట్టుడికింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధా వద్ద మందీ మార్బలంతో ధర్నాకు దిగారు. ఆమెకు పోలీసులు దగ్గరుండి స్వాగతం పలికారు. రోడ్డుపై గంటల తరబడి బైఠాయించినా ప్రేక్షకపాత్ర వహించారే తప్ప ఆమెను పక్కకు తప్పించే ప్రయత్నంగానీ.. ధర్నా విరమించాలని కూడా అడగలేదు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే సమయంలో మినిస్టర్ క్వార్టర్స్ వద్ద విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారంటూ స్టూడెంట్లు ఫైర్​అయ్యారు. 

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగిన నిర్వాహకులపైనా పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ముట్టడించిన టీఎన్ ఎస్ఎఫ్ నాయకుల పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మంత్రులు పాల్గొన్న ధర్నాలకు పోలీసులే దగ్గరుండి ఏర్పాట్లు చూడటం.. ధర్నాలు అయిపోయే వరకు ట్రాఫిక్ ను ఆపేయడం గమనార్హం. అధికార పార్టీ నాయకులు, మంత్రులు ధర్నాలు చేస్తే రక్షణగా ఉంటున్న పోలీసులు ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇవాళ కొన్ని చోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు తగటబెట్టకుండా రక్షణగా నిలిచిన పోలీసులు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.