- హాజరుకానున్న కేటీఆర్
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో బుధవారం బీఆర్‍ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ వరంగల్ హంటర్‍రోడ్ సీఎస్‍ఆర్ గార్డెన్ సర్కిల్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరుతో మే 6న సభ నిర్వహించిన నేపథ్యంలో అదే రోజున బీఆర్‍ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది.
రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని బీఆర్‍ఎస్ నేతలు తెలిపారు. ఈ సభకు బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య వరంగల్‌లో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.12 వేల రైతు భరోసా ఇవ్వడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నేతలు రెండున్నరేళ్లుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలిత, పులి రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు.
