విభజన హామీలు నెరవేర్చండి..కేంద్ర ప్రభుత్వానికి వద్ది రాజు రవిచంద్ర డిమాండ్‌‌‌‌‌‌‌‌

విభజన హామీలు నెరవేర్చండి..కేంద్ర ప్రభుత్వానికి వద్ది రాజు రవిచంద్ర డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • ఆల్‌‌‌‌‌‌‌‌ పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పలు అంశాలను లేవనెత్తిన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం ప్రకారం 2014 లో తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంట్ ఫోర్ లీడర్ వద్ది రాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం కేంద్రం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన పాల్గొని పలు అంశాలను లేవనెత్తారు. అనంతరం వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ సీసీఐ కర్మాగారాన్ని పునరుద్ధరణ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

మామునూరు, ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, హైదరాబద్‌‌‌‌‌‌‌‌కు ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2వ దశకు అనుమతులు, ఇతర అంశాలను లేవనెత్తానని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అంబేద్కర్ -వాద్రా, సీతమ్మ, సమ్మక్క సారలమ్మ సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మీడియాకు తెలిపారు.

ఆ గనుల్ని సింగరేణికి బదలాయించండి 

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని కోరారు. ఓ వైపు వర్షాల పడక, మరోవైపు రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సాగు, తాగునీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని, విద్యుత్ సరఫరాలో కోతలు పెరిగిపోయాయని అన్నారు. ఈ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకోసం గోలేటి, మణుగూరు, పూసపల్లి, మాదారం, కేకే గనులతో పాటు ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన కోయగూడెం–3, సత్తుపల్లి–3, శ్రావణపల్లి బొగ్గు గనులను  సింగరేణి సంస్థకు బదలాయించాలని ఆల్ పార్టీ మీటింగ్ లో కోరినట్లు చెప్పారు. ఈ నిర్ణయం బొగ్గు, థర్మల్ పవర్ ఉత్పత్తికి దోహదపడటమే కాకుండా సింగరేణి సంస్థకు లాభాలు తెస్తాయన్నారు. కాళేశ్వరం బహుళ దశ సాగునీటి పథకంలోని కన్నెపల్లి నుంచి నీళ్లను పంపింగ్ చేసినట్టయితే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ ఉందని రవిచంద్ర మండిపడ్డారు.