యూనిఫాం సివిల్​ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నం : సీఎం కేసీఆర్​

యూనిఫాం సివిల్​ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నం :  సీఎం కేసీఆర్​
  • పార్లమెంట్​ సమావేశాల్లో పోరాడుతం
  • కార్యాచరణను రెడీ చేయాలని కేకే, నామాకు ఆదేశం
  • ప్రజలను విభజించాలనికేంద్రం చూస్తున్నదని ఆరోపణ
  • సీఎంతో భేటీ అయిన ఒవైసీ బ్రదర్స్​,  ముస్లిం పర్సనల్​లా బోర్డు ప్రతినిధులు
  • యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి.. 75 పేజీల నోట్​ అందజేత

హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్​సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూనిఫాం సివిల్ ​కోడ్​(యూసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ తేల్చి చెప్పారు. దేశ ప్రజలను మళ్లీ విభజించేందుకు ఈ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్నదని దుయ్యబట్టారు. ఎంఐఎం నేతలు అసదుద్దీన్​ ఒవైసీ, అక్బరుద్దీన్​ ఒవైసీ, ఆల్​ఇండియా ముస్లిం పర్సనల్​ లా బోర్డు ప్రతినిధులు సోమవారం ప్రగతి భవన్​లో కేసీఆర్​తో భేటీ అయ్యారు. యూసీసీ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యతిరేకించాలని వారు సీఎం​ను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ..  బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధిని విస్మరించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని, ఇప్పుడు యూసీసీ పేరుతోనూ కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. 

ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారతదేశ ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము తిరస్కరిస్తామని, అందులో భాగంగానే యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్​ స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక సంస్కృతి గల ఆదివాసీలు, గిరిజనులు, పలు మతాలు, జాతుల వారితో పాటు పలు ప్రాంతాల్లోని హిందువులు ఈ బిల్లుతో అయోమయానికి గురవుతారన్నారు. 

అది దురుద్దేశంతో కూడుకున్న చట్టం

కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ చట్టం దురుద్దేశంతో కూడుకున్నదని కేసీఆర్​ ఆరోపించారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ఈ చట్టం పేరుతో మరోసారి విభజన రాజకీయాలు చేస్తున్నరు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అడ్డుకుంటం. భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని పోరాడుతం” అని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాలని బీఆర్​ఎస్​ రాజ్యసభ, లోక్​సభ పక్ష నేతలు డాక్టర్​ కె. కేశవరావు, నామా నాగేశ్వర్ రావును కేసీఆర్​ ఆదేశించారు. కాగా, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్​కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్​ను కలిసి వారిలో ఎంఐఎం చీఫ్​, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ, ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్​ ఒవైసీతోపాటు ఆల్​ఇండియా ముస్లిం పర్సనల్​లా బోర్డు అధ్యక్షుడు ఖాలీద్​సయిఫుల్లా రెహ్మాని తదితరులు ఉన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్​అలీ, కేటీఆర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయిఫుల్లా రెహ్మానిని కేసీఆర్ ఘనంగా సత్కరించారు.

కేసీఆర్​కు 74 పేజీలతో నోట్​

సీఎం కేసీఆర్​కు ఆల్​ఇండియా ముస్లిం పర్సనల్​ లా బోర్డు ప్రతినిధులు 74 పేజీలతో కూడిన ఒక నోట్​ను అందజేశారని అసదుద్దీన్​ ఒవైసీ తెలి పారు.  యూసీసీ చట్టం వల్ల కలిగే నష్టాలు అందు లో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్​సహా అన్ని పార్టీల ప్రతినిధులను కలుస్తున్నారని, త్వరలోనే ఏపీ సీఎం జగన్​ను కూడా కలిసి యూ సీసీని వ్యతిరేకించాలని కోరుతామని వెల్లడిం చారు. ‘‘ఈ బిల్లు పేరుతో దేశ ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి విభజన తీసుకువస్తుందో కేసీఆర్​కు వివరించినం. యూసీసీతో ఒక్క ముస్లింలకు మాత్రమే నష్టం జరుగదు.. క్రిస్టియన్లు, గిరిజనులు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు ఇబ్బం దులు ఎదురవుతయ్​. దేశంలోని గిరిజనులకు భిన్న జీవన శైలి, ఆచార వ్యవహారాలు ఉంటయ్​. వాటిని ఇది దెబ్బతీ స్తుంది” అని అన్నారు. హిం దువులకూ ఈ చట్టంతో ఇబ్బందులు ఎదురవు తాయని చెప్పారు. హిందూ అన్​డివైడెడ్​ ఫ్యామిలీస్​కు రూ.300 కోట్ల ట్యాక్స్​రిబేట్​దక్కిన ట్టుగా ఇన్​కం ట్యాక్స్​ లెక్కలు చెప్తున్నాయని, ఇప్పుడు యూసీసీ చట్టంతో రాయితీలు కోల్పోతారని అన్నారు.