బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గుండెపోటు.. వెంటాడుతున్న విషాదాలు

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గుండెపోటు.. వెంటాడుతున్న విషాదాలు

బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల ప్రాణాలను హరిస్తున్నాయి.  బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ కార్యకర్త  ధీరావత్ నాను సింగ్ గుండెపోటుతో మృతి చెందారు.యాదాద్రి భువనగిరి జిల్లా  బొమ్మల రామారం మండలం  చీకటి మామిడిలో ఏప్రిల్ 21న జరిగే   బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. ప్రాథమిక చికిత్స అందించకుండా ... ఆయ‌నను ఆసుపత్రికి త‌ర‌లిస్తుండగా మార్గమధ్యలో  ప్రాణాలు కోల్పోయారు. ధీరావత్ నాను సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు.  మృతుడు కాంచల తండాకు చెందిన పార్టీ కార్యకర్త.  కొంత కాలంగా  పార్టీకి  సేవలందించిన..  ధీరావత్ చివరకు పార్టీ సమావేశంలోనే మృతి చెందారు. అయినా పెద్ద బాస్ ఆ కుటుంబం గురించి పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశాల్లో సౌకర్యాలుండవా?


ఎంతోఅట్టహాసంగా నిర్వహించాలంటున్న బీఆర్ఎస్ అగ్రనేతలకు.. చిన్నపాటి కార్యకర్తల విషయంలో మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులతో సహా ముఖ్య కార్యకర్తలతో  సమావేశ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.  అసలే ఎండాకాలం....బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఆత్మీయసమ్మేళనానికి వచ్చే చిన్నపాటి కార్యకర్తల కష్టాలు అంతా ఇంతా కాదు. సరైన సౌకర్యాలు లేనిచోట సమావేశాలు పెట్డడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.  సభలు, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఉపశమనం పొందేందుకు  ప్రాథమిక చికిత్స శిబిరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం  కాకుండా ఉంటాయి. సమ్మర్ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.