- ఎన్ని కార్పొరేషన్లు చేసినా గెలుపు మాదే: కేటీఆర్
- రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్‌ఎస్ పార్టీనే అని కామెంట్
- కాంగ్రెస్ కన్నా ఎక్కువ రౌడీయిజం బీఆర్‌ఎస్‌కు తెలుసు: తలసాని
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం గులాబీ జెండాయేనని, గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని విమర్శించారు. పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అని, బీజేపీ 12 ఏండ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని విమర్శించారు. ఎట్టికైనా..మట్టికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తుంటారని, అందుకే ఈ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారన్నారు. వాళ్లే పార్టీకి వెన్నెముకలా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం.. పార్టీకి నెంబర్ వన్ కోటగా ఉన్నదని, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినా బంగారంలాంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని 24 డివిజన్లనూ క్లీన్ స్వీప్ చేసే సత్తా బీఆర్‌ఎస్ పార్టీకి ఉందన్నారు.
త్వరలో జరిగే ఎన్నికల కోసం డివిజన్లవారీగా సమావేశాలను నిర్వహించుకుందామని, ఎమ్మెల్యే లేడని భయపడొద్దని సూచించారు. రాబోయేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటున్నదని, పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉండేవన్నారు.
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ శాశ్వతం: తలసాని
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ శాశ్వతంగా ఉండిపోతారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అనేకమంది ప్రారంభించినా.. గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాకారం చేసింది మాత్రం కేసీఆరేనని చెప్పారు. తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ అని పేర్కొన్నారు.
‘‘ఎవడ్రా జాతిపిత అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆ పాపం ఊరికే పోదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీయిజం చేసింది. దానిని ప్రజలు గమనిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువ రౌడీయిజం బీఆర్‌ఎస్‌కు తెలుసని, ఆ రౌడీయిజం తెలంగాణ కోసమే ఉంటుందని పేర్కొన్నారు.
