
- ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులిద్దరూ మంచివాళ్లే.. కానీ, వాళ్లు కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీచేస్తున్నరని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తెలిపారు. నోటా లేదు కాబట్టి ఎన్నికల్లో పాల్గొనడం లేదని అన్నారు. ఇండియా కూటమి క్యాండిడేట్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ఎన్డీయే కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్.. ఇద్దరూ మంచివాళ్లేనని పేర్కొన్నారు. కానీ, వాళ్లంటూ ఓ రాజకీయ వ్యవస్థల తరఫున పోటీ చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సమస్యలను తీర్చడంలో విఫలమయ్యాయని, రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రైతులకు సంఘీభావంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనొద్దని నిర్ణయించామన్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులతో దీనిపై చర్చించామని తెలిపారు. మూసీ సుందరీకరణ.. అతిపెద్ద స్కామ్ అని, విడతలవారీగా రూ.లక్షన్నర కోట్లను దోచుకునే కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. రూ.1,100 కోట్లతో మొదలుపెట్టాలనుకున్న కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు.. ఇప్పుడు రూ.7,360 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘కొండపోచమ్మ సాగర్ 611 మీటర్ల ఎత్తులో ఉంటది. అదే మల్లన్నసాగర్ 516 మీటర్ల ఎత్తులో ఉంటది.
ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి 450 మీటర్ల ఎత్తులో ఉండే గండిపేటకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని పట్టించుకోకుండా సోర్స్ మార్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే నిర్మాణ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది. ‘వెలుగు’లో దీనిపై వార్త వచ్చింది. ఇప్పుడు అదే సంస్థకు కొడంగల్ –నారాయణపేట లిఫ్ట్‌తో పాటు.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కట్టబెడ్తున్నారు’’అని కేటీఆర్ విమర్శించారు.
సీబీఐ ఎంక్వైరీ అంటూ కొత్త నాటకం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ముందు నుంచే విషం చిమ్ముతూ వస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘‘జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసింది. సీబీఐ ఎంక్వైరీ అంటూ కొత్త నాటకానికి తెరలేపింది. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నీళ్లు తెస్తామంటున్నరు. ఎవరైనా.. శంకుస్థాపన చేయాలనుకుంటే తల నుంచి చేస్తారుగానీ.. తోక నుంచి కాదు. ఇప్పుడు మూసీకి తెచ్చేవి కాళేశ్వరం నీళ్లా? కావా? ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ క్షమాపణ చెప్పాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని తెలిపారు. ‘‘కాళేశ్వరంతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు మీ పుస్తకాలే చెప్తున్నాయి. మీరేమో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని అంటున్నారు. 85 పిల్లర్లున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఇందులో ఏడో బ్లాక్ ఒక్కటే కుంగింది. దీనికి రూ.400 కోట్లు కూడా ఖర్చు కావు. ఆ ఖర్చును ఏజెన్సీనే భరిస్తామంటున్నది” అని పేర్కొన్నారు.
పార్టీలో చర్చించే కవితపై నిర్ణయం తీసుకున్నం
తన చెల్లి కవిత అంశంపైనా కేటీఆర్ స్పందించారు. ఇక ఆమె గురించి మాట్లాడా ల్సిందేమీ లేదన్నారు. ఆమె వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెల రోజులు ఓ ఫ్యాక్టరీలో కూలీలుగా చేరి డ్రగ్స్ తయారీ గుట్టును రట్టు చేసే దాకా ప్రభుత్వం ఏం చేస్తున్నది? రేవంత్.. మీ ఈగల్, మీ హైడ్రా, మీ పోలీసు లు, మీ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పో అర్థమవు తున్నది. దేశంలోనే రెండో అతిపెద్ద నెట్వర్క్ ఇది. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారవుతుంటే మీరేం చేస్తున్నా రు?’’అని కేటీఆర్ ప్రశ్నించారు.