పొలిటికల్ హీట్.. జాతీయ నేతల వరుస పర్యటనలు

పొలిటికల్ హీట్..  జాతీయ నేతల వరుస పర్యటనలు
  • 7న హైదరాబాద్ కు బీఎస్పీ చీఫ్ మాయావతి
  • 8న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ
  • 14 న కరీంనగర్ కు అసోం సీఎం బిశ్వశర్మ
  • ఆర్నెల్ల ముందే అస్త్రాలు సర్దుకుంటున్న పార్టీలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఆరు నెలల గడువు ఉండటంతో పార్టీలు అస్త్రాలు సర్దుకుంటున్నాయి. తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 7న( ఆదివారం) బీఎస్పీ చీఫ్​ మాయావతి హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ నిర్వహించే తెలంగాణ భరోసా సభలో ఆమె పాల్గొంటారు. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం జనసమీకరణ చేస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఎస్పీ స్టేట్ చీఫ్​ ఆర్ఎస్పీ ఈ మీటింగ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో పాటు ఈ నెల 8న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ హైదరాబాద్ వస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్బీనగర్ లోని శ్రీకాంతా చారి విగ్రహం వద్ద నుంచి సరూర్ నగర్ స్టేడియం వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం జరిగే నిరుద్యోగ నిరసన సభలో ఆమె ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఏఐసీసీ,పీసీసీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ కు వచ్చారు.

ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లు, కో ఆర్డినేషన్ కమిటీలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు పార్టీలు ప్రధానంగా నిరుద్యోగులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపైనే ఫోకస్ పెట్టాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోనున్నాయి. మరో వైపు బీజేపీ సైతం కరీంనగర్ లో లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14న హిందూ ఏక్తా యాత్ర పేరిట నిర్వహించే ఈ సభలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ తదితరులు హాజరు కానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.