ఎమ్మెల్యే హత్య కేసులో జైలుశిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు

ఎమ్మెల్యే హత్య కేసులో జైలుశిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు

న్యూఢిల్లీ : బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ ని కిడ్నాప్‌ చేసి, హతమార్చిన కేసులో అఫ్జల్‌ అన్సారీతోపాటు, అతని సోదరుడు ముఖ్తార్‌ అన్సారీ కూడా నిందితులుగా ఉన్నారు. ఘాజీపూర్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి శనివారం (ఏప్రిల్ 29న)  ఈ కేసులో తీర్పు వెలువరించారు.

అఫ్జల్‌ అన్సారీకి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్‌ మే 1వ తేదీన అన్సారీపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అఫ్జల్‌ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ (BSP) తరఫున ఎంపీగా గెలిచారు. 2005 నాటి ఈ కేసులో ఇప్పటికే అఫ్జల్‌ అన్సారీ సోదరుడు ముఖ్తార్‌ అన్సారీకి జైలుశిక్ష పడింది.