బీజేపీ ఎంపీపై చర్యలు తీస్కోకుంటే..పార్లమెంట్​ను విడిచిపోతా

బీజేపీ ఎంపీపై చర్యలు తీస్కోకుంటే..పార్లమెంట్​ను విడిచిపోతా
  •     లోక్ సభ స్పీకర్ కు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ లేఖ
  •     రమేశ్ బిధూరి తనను మతపరంగా దూషించారని ఫిర్యాదు

న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను మతపరంగా తీవ్రమైన పదజాలంతో దూషించారంటూ బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్​ అలీ కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం లోక్ సభలో చంద్రయాన్ పై చర్చ సందర్భంగా రమేశ్ బిధూరి తనను తిట్టారని, ఆ తిట్లు రికార్డుల్లోనూ ఉన్నాయన్నారు. నిండు సభలో తనకు జరిగిన అవమానం తలచుకుని రాత్రంతా నిద్రపట్టలేదన్నారు. శుక్రవారం దీనిపై మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టారు. రమేశ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చర్యలు తీసుకోకపోతే తానే పార్లమెంట్ ను విడిచి వెళ్తానన్నారు. డానిష్ అలీ ఫిర్యాదు అనంతరం బీజేపీ సౌత్ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూరిపై స్పీకర్ తీవ్రంగా స్పందించారు.

మున్ముందు ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిధూరి కామెంట్లను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, రమేశ్ బిధూరి కామెంట్లపై ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు. దీంతో సభలో రమేశ్ తీరుపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని, అతనిని సస్పెండ్ చేయాలని లేదా అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మరోవైపు రమేశ్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అన్ పార్లమెంటరీ భాషను వాడినందున అతనిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో 15 రోజుల్లోగా  వివరణ ఇవ్వాలని ఆదేశించింది.