- బీఎస్పీ వల్లే తెలంగాణ బిల్లు గట్టెక్కింది
- పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ శేఖర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 90 శాతం మంది బహుజన ప్రజలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అడుగడుగునా వంచిస్తున్నాయని బీఎస్పీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ ఆరోపించారు. 2014లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే సమయానికి నాటి టీఆర్ఎస్‌కు ఉన్న బలం కేవలం ఇద్దరు ఎంపీలే అని, ఆ ఇద్దరితో బిల్లు పాస్ కావడం అసాధ్యమన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదానికి బీఎస్పీకి చెందిన 39 మంది ఎంపీల మద్దతు కీలకమైందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ల మీటింగ్‌లో ఇబ్రాం శేఖర్ మాట్లాడారు.
అంబేద్కర్ ఆశయాల కోసం ఎలాంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా 39 మంది బీఎస్పీ ఎంపీలతో బేషరతు మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లును గట్టెక్కించింది బీఎస్పీ చీఫ్ మాయావతి అని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం తీసుకొచ్చిన అంబేద్కర్, పార్లమెంట్‌లో గెలిపించిన బీఎస్పీ,ఈ ఇద్దరే తెలంగాణకు అసలైన నిర్మాతలని శేఖర్ పేర్కొన్నారు. ఈ చారిత్రక సత్యాన్ని, మాయావతి నాయకత్వాన్ని ప్రతి ఇంటికీ, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లకు శేఖర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాం కృష్ణతో పాటు నేతలు పాల్గొన్నారు.
