
హైదరాబాద్: అంబర్ పేట్‌లోని డీడీ కాలనీలో బీటెక్ విద్యార్థిపై దాడి జరిగింది. కర్రలు, బీరు సీసాలతో మూకుమ్మడిగా దాడి చేశారు దుండగులు. కాగా, స్నేహితుడి ఇంటిపై కొందరు దాడి చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాడు బాధితుడు. ఒంటరిగా వచ్చిన విద్యార్థిపై సుమారు 20 మంది యువకులు మూకుమ్మడిగా ఎటాక్ చేశారు.
కర్రలు, బీరు సీసాలతో విచక్షణరహితంగా కొట్టారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు విద్యార్థి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని మలక్ పేట్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అంబర్ పేట్ పోలీసులు. ఈ ఘటనతో డీడీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.