హైదరాబాద్, వెలుగు: బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాన బౌద్ధ క్షేత్రాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాయంత్రం వేళ పర్యాటకులను అలరించేందుకు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు టూరిజం డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తెలిపారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్చరల్ కార్యక్రమాలు, బుద్ధి చరిత్రను తెలిపే నాటక ప్రదర్శన, చిల్డ్రన్స్ పార్కు ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, బిహార్ నవనలంద వర్సిటీ వీసీ రాం నక్షత్రప్రసాద్, మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, ఎమ్మెల్యే కొందురు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, టూరిజం ఎండీ గౌతమి, టూరిజం అధికారులు పాల్గొననున్నారు.

