
రూ. 1.77 లక్షల కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు 12% పెరిగాయి. పోయిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1.57 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి (2024–25) రూ. 1.77 లక్షల కోట్లకు అలకేషన్ ను ఆర్థిక మంత్రి నిర్మల పెంచారు. అయితే, గత బడ్జెట్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చేసిన ఖర్చులు రూ. 1.71 లక్షల కోట్లకు చేరాయి. దీని ప్రకారం చూస్తే తాజాగా కేటాయింపులు 3 శాతం మాత్రమే పెరిగాయి.
తాజా కేటాయింపుల్లో ఉపాధి హామీ పథకానికి రూ. 86 వేల కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ లో రూ. 60 వేల కోట్లు కేటాయించగా, ఈ సారి 43 శాతం నిధులు పెరిగాయి. అయితే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే చేసిన వ్యయం రూ. 86 వేల కోట్లకు చేరింది. తాజాగా అంతే మొత్తంలో నిధులను కేటాయించారు. అంతకుముందు 2022–23లో రూ. 73 వేల కోట్లను కేటాయించగా.. రూ. 90,805 కోట్లను ఖర్చు చేశారు. ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద మరో 2 కోట్ల ఇండ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ స్కీం కోసం రూ. 54,500 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో ఈ పథకానికి రూ. 54,487 కోట్లు కేటాయించగా, రూ. 32 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.