కుక్క కరిచిన గేదె పాలు తాగితే రేబిస్ వ్యాధి వస్తుందా..? జగిత్యాల జిల్లాలో ఆస్పత్రి ముందు క్యూ కట్టిన గ్రామస్తులు

కుక్క కరిచిన గేదె పాలు తాగితే రేబిస్ వ్యాధి వస్తుందా..? జగిత్యాల జిల్లాలో ఆస్పత్రి ముందు క్యూ కట్టిన గ్రామస్తులు

రేబిస్ వ్యాధి వచ్చిన గేదె పాలు తాగితే రేబిస్ వస్తుందా..? వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిందేనా..? దీని గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారు..? జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన తర్వాత చాలా మందిలో వచ్చిన డౌట్ లు ఇవి. కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి బర్రె చనిపోవడంతో.. పాలు తాగిన తమకు కూడా వ్యాధి వస్తుందనే భయంతో జనాలు ఆస్పత్రి ముందు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో కుక్క కాటుకు గేదె చనిపోయింది. దీంతో రేబిస్ వ్యాధి సోకిన గేదె పాలు తాగిన జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గేదె పాలు తాగిన తమకు కూడా రేబిస్ సోకుతుందేమోననే భయంతో మెట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు గ్రామస్తులు. 

వేంపేట  రావుట్ల బాబయ్యకు చెందిన గేదె వారం రోజులుగా అనారోగ్యంతో ఉండి.. గత రెండు రోజుల క్రితం మృతి చెందింది. గేదె రేబిస్ వ్యాధితో మృతి చెందినట్లుగా పశు వైద్యులు నిర్ధారించారు. బాబయ్య గేదె పాలను ప్రతిరోజూ  పాల కేంద్రానికి తరలించేవాడు. దీంతో పాలను వినియోగించే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

ALSO READ : అగ్ని పర్వతం పేలింది.. లావా రాలేదు..

గ్రామస్తుల భయాందోళన గురించి తెలుసుకున్న వైద్యులు వారికి అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. మరిగించిన పాలను తాగితే రేబిస్ వ్యాధి సోకదని భయాందోళన చెందవద్దని  చెప్పారు.  అయినా భయంతో రేబిస్ వ్యాక్సిన్ కోసం మెట్ పల్లి ప్రాథమిక వైద్యశాల ముందు క్యూ కట్టారు. 

వైద్యులు చెప్పినా గ్రామస్తులు భయాందోళనకు గురి కావడానికి కారణం.. పచ్చి పాలతో చేసిన తీర్థం తాగటమే. శివరాత్రి రోజు అభిషేకం కోసం పచ్చిపాలనే వాడి, తీర్థంగా స్వీకరించారు గ్రామస్తులు. దానితో గ్రామస్తులలో భయం, అనుమానం, ఆందోళన మొదలైంది. 

శివరాత్రి రోజు పాల వినియోగంపై గేదె యజమాని బాబయ్య వివరణ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా తమ గేదె గడ్డి తినకుండా పాలు ఇవ్వలేదని చెప్పాడు. శివరాత్రి రోజు పాలు పిండినా.. పాల కేంద్రానికి విక్రయించలేదని చెప్పినప్పటికీ ఎవరు నమ్మడం లేదని బాబయ్య తెలిపాడు. 

గ్రామస్తులు భయపడి హాస్పిటల్ కు రావడంతో ఇప్పటివరకు 30 మందికి పైగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు వైద్యాధికారి అచ్చిత్ రెడ్డి.  పాలు తాగితే‌ రెబీస్ రాదని.. ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.