హవాయి ద్వీపంలో కార్చిచ్చు..

హవాయి ద్వీపంలో కార్చిచ్చు..

హవాయి (Hawaii) ద్వీపంలో భీకర కార్చిచ్చు వ్యాపించింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 మంది వరకు చనిపోయారని మౌయి కౌంటీ వెల్లడించింది. హరికేన్‌ ప్రభావంతో బలంగా గాలులు వీస్తున్నాయి. చుట్టు పక్కల వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు అక్కడి అధికారులు.

భారీ మంటల ధాటికి వందల భవనాలు దెబ్బతిన్నాయి. కార్లు చూస్తుండగానే కాలిబూడిదయ్యాయి. వీధుల్లో దట్టమైన పొగ వ్యాపించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు.

ఇప్పటివరకు 217కు పైగా భవనాలు ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు అధికారులు. దాదాపు 36 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది.

దాదాపు 40 వేల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి వెళ్లినట్లు చెబుతున్నారు. మౌయి విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. విమానయాన సంస్థలు ఛార్జీలను తగ్గించి, ప్రజలను ద్వీపం నుండి బయటకు తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. 

కొందరు పొగ నుంచి రక్షించుకోవడానికి దగ్గరలోనే ఉన్న పసిఫిక్ మహా సముద్రంలోకి దూకారు. వారిని రక్షించడానికి యూఎస్ కోస్ట్ గార్డు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చాలా చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. సెల్ ఫోన్లు పనిచేయడం లేదు.