తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. థియేటర్ల మనుగడ కోసం పూర్తిస్థాయి పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్మాతలు, హీరోలను కోరుతున్న నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిబిటర్స్ సమావేశం అనంతరం స్పందించిన ఆయన.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపిస్తున్న భారీ కలెక్షన్లు నిజానికి ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల కాదని, టికెట్ ధరలు మరియు ఇతర ఖర్చులు పెరగడం వల్ల మాత్రమే వసూళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయిందని, కొద్దిమంది ప్రేక్షకులపైనే అధిక టికెట్ భారం వేసి దాన్నే “భారీ కలెక్షన్లు”గా చూపించడం సరైన విధానం కాదన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సినిమాల పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెప్పారు.
థియేటర్ల సంక్షోభానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని బన్నీ వాసు వివరించారు:
1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం
2. సినిమాలను చాలా త్వరగా ఓటీటీలో విడుదల చేయడం
3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం
4. మల్టీప్లెక్స్‌లలో అధిక క్యాంటీన్ ధరలు
ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదని తెలిపారు
తెలుగు సినీ పరిశ్రమలో హీరోల ప్రభావం ఎంతో కీలకమని, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తే ప్రేక్షకుల్లో థియేటర్లపై ఆసక్తి తగ్గిపోతుందని అన్నారు. అలాగే 27 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి రావడం కూడా థియేటర్లకు పెద్ద దెబ్బగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు.
ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇద్దరూ నష్టాల్లో ఉన్నారనే విషయాన్ని అంగీకరించిన ఆయన.. “ఆదాయంలో ఎవరు ఎంత శాతం తీసుకోవాలి?” అన్న దానికంటే, అసలు ఆదాయం ఎందుకు తగ్గిపోతోందో తెలుసుకుని దాన్ని సరిచేయడమే ముఖ్యమని పేర్కొన్నారు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అని ప్రశ్నిస్తూ తన ట్వీట్ ముగించారు బన్నీ వాసు.
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని…
— Bunny Vas (@TheBunnyVas) May 13, 2026
రెంటల్, పర్సంటేజీ విధానం అంటే ఏంటి?
ప్రస్తుత తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ లేదా పర్సంటేజీ(మినిమమ్ గ్యారంటీ) విధానంపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇందులో థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్అమౌంట్ను డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతాడు.
సినిమా హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్లిపోతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్‌కు, ప్రొడ్యూసర్ కు భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, థియేటర్ యజమానికి మాత్రం రిస్క్ ఉంటోంది. కలెక్షన్లు తగ్గినా, ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఎగ్జిబిటర్లు లాస్అవుతున్నారు.
మల్టీప్లెక్సుల్లో మాత్రం పర్సంటేజీ (షేర్) విధానం అమలు చేస్తుండడంతో సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్దిష్ట శాతంలో పంచుకుంటున్నారు. కానీ, సింగిల్స్క్రీన్ థియేటర్లకు ఇది వర్తింపజేయడం లేదు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, నార్త్ ఇండియా మార్కెట్లలో పర్సంటేజీ విధానం అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. తమ పెట్టుబడులు భారీగా ఉంటాయని, ఈ పర్సంటేజీ విధానం వల్ల తమ డబ్బుల రికవరీ కష్టమవుతుందని అంటున్నారు.
