పోడు భూములను వదులుకొనే ప్రసక్తే లేదు:బుర్స పోచయ్య

పోడు భూములను వదులుకొనే ప్రసక్తే లేదు:బుర్స పోచయ్య

గుడిహత్నూర్, వెలుగు: పోడు భూముల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసీల అస్తిత్వ పోరు గర్జన సభలో  సంఘం రాష్ట్ర నాయకులు శుక్రవారం మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా ఆదివాసీలపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని, ఇప్పటివరకు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఫారెస్టు అధికారులపై కేసులు నమోదు చేసేందుకు పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.  

ఆదివాసీలను దోచుకుంటున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీలు భుక్తి కోసం భూమిని సాగు చేస్తే మహిళలని కూడా చూడకుండా ఫారెస్టు ఆఫీసర్లు దాడులు చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో పోడు భూములను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదివాసీలకు ఉపాధి చూపించలేని ఐటీడీఏ తమకొద్దని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానిక ఆదివాసీలు, భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.