కరెంట్ తీగలు తగిలి కాలిబూడిదైన బస్సు.. ముగ్గురు మృతి.. 10 మందికి గాయాలు

కరెంట్ తీగలు తగిలి కాలిబూడిదైన బస్సు.. ముగ్గురు మృతి.. 10 మందికి గాయాలు

జైపూర్: కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ఘటన మరవకముందే అలాంటి ఘోర ప్రమాదమే రాజస్తాన్‌‌లో చోటుచేసుకుంది. జైపూర్ జిల్లా మనోహర్‌‌పూర్‌‌లోని జైపూర్ –ఢిల్లీ హైవేపై వలస కార్మికులతో వెళ్తున్న ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సు.. ఓవర్ హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగను తాకింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. 

ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌‌లోని పిలిభిత్ కు చెందిన దాదాపు 30 మంది ఇటుక బట్టీ కార్మికులు పని కోసం రాజస్తాన్‌‌ బయలుదేరారని అధికారులు తెలిపారు.

మనోహర్‌‌పూర్ ఏరియాలోని తోడి గ్రామం వద్ద హై టెన్షన్​ వైర్లు తగిలి బస్సు కరెంట్ షాక్‎కు గురైందన్నారు. బస్సులో కరెంట్ ప్రవహించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. 

ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైందని చెప్పారు. మంటలు చెలరేగినప్పుడు ప్యాసింజర్లలో చాలామంది బస్సు నుంచి దూకి తప్పించుకున్నారని వివరించారు. బస్సు పైకప్పుపై గ్యాస్ సిలిండర్లు, ఇతర గృహోపకరణాలు, కొన్ని వెహికల్స్ పెట్టారని తెలిపారు. రోడ్డుపై గుంతల వల్ల అవి ఎగిరి హైటెన్షన్ విద్యుత్ తీగను తాకాయని.. దాంతో బస్సుకు మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కాగా..ఘటనపై సీఎం భజన్​లాల్​ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.